కరీంనగర్‌లో సబ్‌రిజిస్ట్రార్‌గా పనిచేసి రిటైర్ అయ్యాడు మాధవశర్మ.
నలభై ఏళ్ల ఉద్యోగంలో వేలాది ఆస్తుల రిజిస్ట్రేషన్లు చేశాడు. ఎవరి భూమి ఎవరిది, ఎవరు ఎవరికి అమ్మారు, ఎవరు మోసం చేశారు — అన్నీ అతని కళ్లముందే జరిగాయి.
రిటైర్ అయిన తరువాత అద్వైతం చదవడం మొదలుపెట్టాడు.
మొదట్లో బాగానే అనిపించింది. తరువాత ఒక విచిత్రమైన భావన మొదలైంది.
"ఈ శరీరం నేను కాదు. ఈ మనస్సు నేను కాదు. ఆలోచనలు వాటంతట అవే వస్తున్నాయి. మరి నేను ఎవరు?"
రోజంతా ఇదే ఆలోచన.
ఒకరోజు భార్య బయటికి వెళ్ళినప్పుడు మాధవ శర్మ వంట చేశాడు
అమ్మ పార్వతమ్మ అడిగింది:
"కూరలో ఉప్పు వేశావా?"
"ఉప్పు వేయడం జరుగుతోంది."
"ఏమిట్రా ఈ కొత్త భాష? ఉప్పు వేశావా లేదా?"
"వేసినట్టే ఉంది."
కమలమ్మ విసుక్కుంది.
"అద్వైతం నేర్చుకున్నావని ఇంట్లో మనుషులతో మాట్లాడటం కూడా మర్చిపోయావా?"
అతను నవ్వాడు. కానీ లోపల మాత్రం ఒక గర్వం ఉంది.
తనకు ఇప్పుడు సాధారణ మనుషులకు తెలియని విషయం తెలిసిందని అనుకుంటున్నాడు.
---
ఒకరోజు అతని పాత సహోద్యోగి రామకృష్ణ వచ్చాడు.
"మాధవా, నీకు ఒక పని ఉంది. మా తమ్ముడు చనిపోయాడు. అతని ఆస్తి విషయంలో పిల్లలు గొడవపడుతున్నారు. నువ్వు వచ్చి పత్రాలు చూసి చెప్పాలి."
మాధవశర్మ వెళ్లాడు.
అక్కడ ఇద్దరు అన్నదమ్ములు ఒకరినొకరు తిట్టుకుంటున్నారు. తల్లి ఒక మూల కూర్చుని ఏడుస్తోంది.
మాధవశర్మ పత్రాలు చూసి,
"ఈ ఆస్తి మీ తండ్రి సంపాదించింది. మీరు ఇద్దరూ గొడవపడటం ఎందుకు? చివరికి ఏమీ తీసుకెళ్లరు కదా!" అన్నాడు.
పెద్ద కొడుకు కోపంగా అన్నాడు:
"మాధవగారూ, ఎవరు తీసుకెళ్లరని మాకు తెలుసు. కానీ మా పిల్లలకు ఇవ్వడానికి మేము బతుకుతున్నాం. మీరు జ్ఞానం చెప్పడం సులభం."
మాధవశర్మకు ఏదో తగిలింది.
తన జీవితమంతా ఆస్తులపై పనిచేశాడు. ఇప్పుడు ఆస్తి మాయ అని చెబుతున్నాడు. కానీ ఆస్తి కోసం ఏడుస్తున్న మనుషుల బాధను మాత్రం అర్థం చేసుకోలేకపోతున్నాడు.
ఆ ఇంటి నుంచి బయటకు వస్తుండగా, రామకృష్ణ తల్లి అతని చెయ్యి పట్టుకుంది.
"బాబూ, మా ఆయన చనిపోయినప్పుడు కూడా అందరూ ఇలాగే సర్దుకోమన్నారు. ఇప్పుడు పిల్లలు గొడవపడుతున్నారు. నాకు ఆస్తి వద్దు. వాళ్లు ఇద్దరూ కలిసుంటే చాలు."
మాధవశర్మకు ఏం చెప్పాలో తెలియలేదు.
ఆమెకు అద్వైతం తెలియదు. ఉపనిషత్తులు చదవలేదు. కానీ తనకు కావలసింది ఏమిటో మాత్రం స్పష్టంగా తెలుసు.
మాధవశర్మకు మాత్రం చాలా పుస్తకాలు తెలుసు. కానీ ఆ క్షణంలో ఆమె బాధను వినడానికి కూడా తగినంత ప్రశాంతత లేదు.
---
మరుసటి రోజు ఆశ్రమానికి వెళ్లాడు.
అక్కడ గురువు సదాశివానంద కూర్చుని ఉన్నారు.
"స్వామీ, నేను సాక్షిగా ఉండాలని ప్రయత్నిస్తున్నాను. కానీ జీవితంలో జరిగే విషయాలు నన్ను లాగేస్తున్నాయి."
గురువు అడిగారు:
"నిన్న నీకు కోపం వచ్చిందా?"
"వచ్చింది."
"కోపాన్ని గమనించావా?"
"గమనించాను."
"కోపాన్ని గమనించినవాడు ఎవరు?"
మాధవశర్మ వెంటనే, "సాక్షి" అన్నాడు.
గురువు నవ్వారు.
"అది నీకు తెలిసిన సమాధానం. కానీ నువ్వు నిజంగా చూశావా?"
మాధవశర్మ మౌనంగా ఉన్నాడు.
గురువు ఒక చిన్న కాగితం తీసుకుని, దానిపై ‘సాక్షి’ అని రాసి మాధవశర్మకు ఇచ్చారు.
“ఇది ఏమిటి?” అని అడిగారు.
“ఇందులో ‘సాక్షి’ అని రాసి ఉంది గురువుగారూ” అన్నాడు మాధవశర్మ.
“అయితే, ఈ కాగితంపై కనిపిస్తున్న ‘సాక్షి’ అనే పదమే నిజమైన సాక్షి అవుతుందా?” అని గురువు ప్రశ్నించారు.
"కాదు."
"అలాగే, నువ్వు 'నేను సాక్షిని' అని అనుకుంటున్న భావన కూడా సాక్షి కాదు. అది కూడా ఒక ఆలోచనే."
మాధవశర్మకు చెమటలు పట్టాయి.
ఇంతకాలం తాను సాక్షీభావాన్ని ఒక కొత్త వ్యక్తిత్వంగా తయారు చేసుకున్నాడని అర్థమైంది.
గురువు కొనసాగించారు:
“కోపం వచ్చినప్పుడు దాన్ని గమనిస్తున్నావు కదా! అలా గమనించే సమయంలో, కోపానికి వేరుగా ఒక పరిశీలకుడు ఉన్నాడని భావిస్తున్నావా? ఆ పరిశీలకుడికి కూడా ఒక గుర్తింపు, ఒక స్థానం, ఒక రూపం ఉన్నాయా? ఉంటే, ఆ భావనను కూడా నిశితంగా గమనించు.”
---
ఆశ్రమం నుంచి బయలుదేరేటప్పుడు, ఒక యువకుడు గురువుతో వాదిస్తున్నాడు.
"స్వామీ, నా తండ్రి నన్ను చిన్నచూపు చూస్తాడు. నేను ఆయనను పట్టించుకోవడం మానేశాను. నాకు ఎలాంటి బంధాలు అవసరం లేదు. అన్నీ మాయే కదా!"
గురువు అతన్ని అడిగారు:
"నీ తండ్రి నిన్ను బాధపెట్టినప్పుడు, నువ్వు బాధపడ్డావా?"
"అవును."
"ఇప్పుడు ఆయనను పట్టించుకోవడం మానేసినప్పుడు, నీకు బాధ తగ్గిందా?"
యువకుడు తల ఊపాడు.
"లేదు స్వామీ. ఇంకా ఎక్కువగా ఉంది."
గురువు అన్నారు:
“అయితే, నిజంగా ఆ బంధం నుంచి బయటపడ్డావా? లేక ఆ బంధం వల్ల కలిగిన బాధను, నిరాశను, ఆశాభంగాన్ని అణచిపెట్టి, వాటికి ‘వైరాగ్యం’, ‘అనాసక్తి’ వంటి మంచి పేర్లు పెట్టుకున్నావా? మనిషిని వదిలేశానని అనుకోవడం వేరు; ఆ మనిషి పట్ల నీలో ఇంకా మిగిలి ఉన్న ఆశలు, అసంతృప్తి, బాధ, ఎదురుచూపుల నుంచి నిజంగా విముక్తి పొందడం వేరు. బంధాన్ని వదిలేశానని చెప్పుకోవడం సులభం. కానీ ఆ బంధం నీ మనసులో ఇంకా ఎలాంటి రూపంలో కొనసాగుతోందో నిజాయితీగా చూసుకోవడమే అసలైన విచారణ.”
మాధవశర్మ ఆ మాటలు విన్నాడు. తనలో కూడా అలాంటి ఒక దాచిన బాధ ఉందేమో అనిపించింది.
---
మాధవశర్మ ఇంటికి వచ్చాడు.
కొన్ని రోజులు ఎలాంటి ప్రత్యేక సాధన చేయలేదు. తనకు కోపం వస్తే కోపం వస్తోందని గమనించాడు. బాధ వస్తే దాన్ని దాచలేదు. భార్యతో మాట్లాడాడు. పిల్లల సమస్యలు విన్నాడు.
ఒకరోజు అతని కుమార్తె ఉద్యోగం వదిలేసి ఇంటికి వచ్చింది.
"నాన్నా, నాకు అక్కడ పని చేయడం ఇష్టం లేదు. అందరూ నన్ను తక్కువగా చూస్తున్నారు."
మాధవశర్మ వెంటనే ఉపదేశం చేయబోయాడు.
"ఇది నీ మనస్సు కల్పన..."
కానీ ఆగిపోయాడు.
"సరే అమ్మా, ముందు నీకు ఏం జరిగిందో చెప్పు."
ఆమె గంటసేపు మాట్లాడింది.
అతను విన్నాడు.
ఆమె మాట్లాడటం పూర్తయ్యాక అడిగింది:
"నాన్నా, నువ్వు ఇప్పుడు ఏమీ చెప్పడం లేదు?"
అతను అన్నాడు:
"నీ బాధను వెంటనే ఒక సిద్ధాంతంతో కప్పేయాలని అనిపించింది. కానీ నీకు ఇప్పుడు సిద్ధాంతం అవసరం లేదనిపించింది."
ఆమె అతని చేతిని పట్టుకుంది.
"నువ్వు ఇప్పుడు మునుపటి నాన్నలా ఉన్నావు."
మాధవశర్మకు కన్నీళ్లు వచ్చాయి.
---
కొద్ది రోజుల తరువాత అతని భార్యకు జ్వరం వచ్చింది. రాత్రంతా దగ్గుతో నిద్రపోలేకపోయింది.
మాధవశర్మ ఆమెకు నీళ్లు ఇచ్చాడు. మందులు తెచ్చాడు. డాక్టర్‌కు ఫోన్ చేశాడు.
ఉదయం కమలమ్మ అడిగింది:
"నిన్న రాత్రి మీరు కూడా పడుకున్నట్టు లేదు. అలసిపోయి ఉంటారు?"
"అవును."
కమలమ్మ కొంటెగా అడిగింది
"మరి సాక్షిగా ఉండి అలసటను గమనించలేదా?"
మాధవశర్మ నవ్వాడు.
"గమనించాను. కానీ దానితోపాటు నీకు మందు ఇవ్వడం కూడా జరిగింది!"
కమలమ్మ నవ్వింది.
ఆ నవ్వులో అతనికి ఏదో అర్థమైంది.
సాక్షిగా ఉండటానికి చేతులు కట్టుకుని కూర్చోవాల్సిన అవసరం లేదు. అవసరమైన పని జరుగుతూనే ఉండవచ్చు.
---
ఒకరోజు మార్కెట్‌కు వెళ్లి కూరగాయలు కొనుక్కుంటూ వస్తున్నాడు.
రోడ్డు పక్కన ఒక చిన్న ప్రమాదం జరిగింది. బైక్ మీద వెళ్తున్న వ్యక్తి జారి పడిపోయాడు.
చుట్టూ ఉన్నవాళ్లు చూస్తున్నారు. కొందరు ఫోన్‌లో వీడియో తీస్తున్నారు.
మాధవశర్మ వెంటనే వెళ్లి అతన్ని లేపాడు. బైక్‌ను పక్కకు జరిపాడు. గాయానికి నీళ్లు పోశాడు. ఆటో ఆపి ఆసుపత్రికి పంపించాడు.
ఇంటికి వచ్చాక కమలమ్మ అడిగింది:
"ఎందుకంత తొందరగా వెళ్లిపోయారు ,మీకు ఆ వ్యక్తి ఎవరో కూడా తెలియదు కదా!"
మాధవశర్మ కొద్దిసేపు ఆలోచించి అన్నాడు:
"తెలియదు. కానీ పడిపోయిన మనిషి కనిపించాడు. లేపాల్సిన అవసరం కనిపించింది. అంతే."
అతను తన మంచితనాన్ని ప్రకటించలేదు. ఎవరికీ చెప్పలేదు. ఆ సంఘటనను తన ఆధ్యాత్మిక పురోగతికి సాక్ష్యంగా కూడా పెట్టుకోలేదు.
ఆ రాత్రి అతనికి ఒక చిన్న సందేహం వచ్చింది.
"నేను సహాయం చేశాను" అనే భావన లేకుండా సహాయం జరిగితే, దానికి పుణ్యం వస్తుందా?
వెంటనే మరో ప్రశ్న వచ్చింది.
"పుణ్యం వస్తుందా లేదా అని తెలుసుకోవాలనుకుంటున్నది ఎవరు?"
అతను నవ్వుకున్నాడు.
ఈసారి ఆ ప్రశ్నకు సమాధానం వెతకడానికి పుస్తకం తెరవలేదు.
---
కొంతకాలం తరువాత గురువుకు ఫోన్ చేశాడు.
"స్వామీ, ఈరోజు నాకు ఏదో అర్థమైంది."
"ఏమిటి?"
"సాక్షిగా ఉండటం అంటే మనుషుల బాధకు దూరంగా నిలబడటం కాదు. బాధను నా వ్యక్తిగత కథగా చేసుకోకుండా, దానికి అవసరమైన స్పందన ఇవ్వడం."
గురువు కొద్దిసేపు మౌనంగా ఉన్నారు.
తరువాత అన్నారు:
"అది కూడా ఒక మంచి మాటే. కానీ దానిని పట్టుకుని కొత్త సిద్ధాంతం చేసుకోకు."
మాధవశర్మ నవ్వాడు.
"అలాగే స్వామీ."
---
కొంతకాలం తరువాత మాధవశర్మ ఆశ్రమానికి వెళ్లాడు. గురువు గదిలో లేరు. బయట చెట్టు కింద కూర్చుని ఉన్నారు.
మాధవశర్మ దగ్గరకు వెళ్లి నమస్కరించాడు.
"స్వామీ, ఇప్పుడు నాకు ఒక విషయం స్పష్టంగా కనిపిస్తోంది. నేను ఇంతకాలం జ్ఞానాన్ని కూడా నా ఆస్తిలా చేసుకున్నాను."
గురువు అడిగారు:
"అది ఇప్పుడు ఎవరికీ కనిపిస్తోంది?"
మాధవశర్మ వెంటనే సమాధానం చెప్పలేదు.
గురువు మళ్లీ అడిగారు:
"నీకు కనిపిస్తున్న ఈ 'నేను' కూడా ఒక భావనగా కనిపిస్తుందా?"
మాధవశర్మ కళ్లుమూసుకున్నాడు. కొద్దిసేపు మౌనంగా ఉన్నాడు.
"స్వామీ, దానికి మాటల్లో సమాధానం చెప్పలేకపోతున్నాను."
గురువు నవ్వారు.
"మాటల్లో చెప్పలేకపోవడం తప్పు కాదు. కానీ మాటలు రాకపోవడమే జ్ఞానం అని అనుకోకు."
మాధవశర్మ తల ఊపాడు.
ఆశ్రమం నుంచి బయలుదేరేటప్పుడు గురువు ఒక మాట అన్నారు:
"జీవితం నీకు ప్రశ్నలు వేస్తూనే ఉంటుంది. ప్రతి ప్రశ్నకు ఒక సిద్ధాంతం తయారు చేయాల్సిన అవసరం లేదు. కొన్ని ప్రశ్నలు నీకు ఉన్న తప్పు నమ్మకాన్ని చూపిస్తాయి. కొన్ని ప్రశ్నలు నీకు తెలియని విషయాన్ని చూపిస్తాయి. రెండింటినీ కలిపి గందరగోళం చేసుకోకు."
---
మాధవశర్మ ఇంటికి వచ్చాడు.
ఆ రాత్రి అతను కిటికీ దగ్గర కూర్చున్నాడు.
బయట వర్షం పడుతోంది.
వర్షాన్ని చూస్తున్నాడు.
వర్షం గురించి ఆలోచనలు వస్తున్నాయి.
తన గురించి కూడా ఆలోచనలు వస్తున్నాయి.
ఏదీ ఆపాలని ప్రయత్నించలేదు.
ఏదీ ప్రత్యేకంగా పట్టుకోవాలని కూడా అనుకోలేదు.
మరుసటి రోజు ఉదయం లేచి, భార్యతో కలిసి కూరగాయలు కొనడానికి మార్కెట్‌కు వెళ్లాడు.
అక్కడ ఒక కూరగాయలమ్మ ధర ఎక్కువ చెప్పింది.
మాధవశర్మ బేరం చేశాడు.
కమలమ్మ నవ్వుతూ అడిగింది:
"ఏమండీ, మీ అద్వైతం ప్రకారం ఇదంతా మాయే కదా? మరి కూరగాయల ధరల విషయంలో మాత్రం ఇంత బేరం ఎందుకండీ?"
మాధవశర్మ నవ్వుతూ అన్నాడు:
"అద్వైతం ప్రకారం మాయే కావచ్చు కమలా! కానీ కూరగాయలమ్మ దగ్గర మాత్రం ఆ మాయ పనిచేయడం లేదు. రూపాయి తగ్గించమంటే అస్సలు తగ్గడం లేదు!’
---
No comments:
Post a Comment